నూతన విద్యావిధానం సీఎం జగన్ ఆలోచనలను ప్రతిబింబిస్తోంది: ఆదిమూలపు సురేశ్

  • నూతన విద్యావిధానం ప్రకటించిన కేంద్రం
  • ముసాయిదా అంశాలు జగన్ ఆలోచనలకు నిదర్శనాలన్న మంత్రి
  • మీడియా సమావేశంలో జగన్ ను కీర్తించిన ఆదిమూలపు
దేశవ్యాప్తంగా విప్లవాత్మక రీతిలో నూతన విద్యావిధానం అమలు చేసేందుకు కేంద్రం తుది ముసాయిదా తీసుకువచ్చింది. దీనిపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం ముసాయిదాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.

"నూతన విద్యావిధానం పాలసీ ముసాయిదా రూపకల్పన 2017లో ప్రారంభమైంది. దీనిపై ఏర్పడిన కస్తూరి రంగన్ కమిటీ నివేదికలు రూపొందించి కేంద్రానికి సమర్పించింది. కొత్త విద్యావ్యవస్థకు అవసరమైన సూచనలు, సలహాల కోసం మమ్మల్ని కూడా పిలిచారు. నూతన విద్యావిధానంపై సీఎం జగన్ స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కేంద్రానికి మా ఆలోచనలను వివరించాం.

కేంద్రం తాజాగా విడుదల చేసిన నూతన విద్యావిధానం తుది ముసాయిదాలోని అంశాలు సీఎం జగన్ ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. విద్య వ్యాపారం కాకూడదని సీఎం జగన్ ఎప్పుడూ చెబుతుంటారు. ఉన్నత విద్యకు పేదరికం అడ్డుగోడ కాకూడదని కూడా ఆయన అంటుంటారు. ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన ముసాయిదాలోని అంశాలు సీఎం జగన్ ఆకాంక్షలకు నిదర్శనంగా నిలిచాయి. విద్య అనేది ప్రజలకు సంబంధించిన విషయం, అది వ్యాపార వస్తువు కాకూడదని కేంద్రం కూడా స్పష్టం చేసింది.

గత ప్రభుత్వం విద్యావిధానం పరంగా చేసింది ఏమీలేదు. పేరుగొప్ప, ఊరుదిబ్బ అన్నట్టుగా తయారుచేశారు. కానీ మేం వచ్చాక ఎంతో ముందుకు తీసుకెళ్లాం. ఇవాళ మానవ వనరుల శాఖను విద్యాశాఖగా పేర్కొనడం అందరికీ తెలిసిందే" అంటూ వివరించారు.


More Telugu News