30 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకున్నారు: అయోధ్య ఫొటోగ్రాఫర్ మహేంద్ర త్రిపాఠి

  • 1991లో అయోధ్య వివాదాస్పద స్థలాన్ని సందర్శించిన మోదీ
  • గుజరాత్ నేతగా అక్కడున్న వారికి మోదీని పరిచయం చేసిన జోషి
  • రామ మందిర నిర్మాణానికి మళ్లీ అయోధ్యకు వస్తానని అప్పుడు చెప్పిన మోదీ
బీజేపీ కురువృద్ధుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి, ప్రధాని మోదీ కలిసి ఉన్న మూడు దశాబ్దాల నాటి ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1991లో రామాలయ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో మోదీ అయోధ్యకు వెళ్లారు. అప్పటికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కూడా కాలేదు. కానీ, బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఆ సందర్భంగా మురళీ మనోహర్ జోషితో కలిసి ఆయన వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. వీరిద్దరి ఫొటోను స్థానిక ఫొటోగ్రాఫర్ మహేంద్ర త్రిపాఠి తీశారు.

ఈ సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ,  రామ జన్మభూమిని ఆనుకుని తన ఫొటో స్టూడియో ఉండేదని చెప్పారు. 1991లో మోదీ వచ్చినప్పుడు వీహెచ్పీ తరపున తానొక్కడినే ఫొటోగ్రాఫర్ గా ఉండేవాడినని తెలిపారు. చారిత్రాత్మకమైన ఈ ఫొటోను తీసినందుకు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. తాను ఫొటో తీస్తున్న సమయంలో కొందరు జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్నారని... గుజరాత్ బీజేపీ నేత అంటూ మోదీని అక్కడున్న వారికి మురళీ మనోహర్ జోషి పరిచయం చేశారని తెలిపారు.

మళ్లీ అయోధ్యకు ఎప్పుడొస్తారని అప్పుడు మేమంతా మోదీని అడిగామని... రామ మందిర నిర్మాణానికి వస్తానని మోదీ చెప్పారని త్రిపాఠి వెల్లడించారు. మూడు దశాబ్దాల క్రితం ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. 1989 నుంచి తాను వీహెచ్పీ కోసం ఫొటోగ్రాఫర్ గా పని చేశానని చెప్పారు. తాను తీసిన ఫొటోలను అయోధ్య తీర్పులో కూడా పొందుపరిచారని తెలిపారు. అయితే, ఈ సందర్భంగా ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమానికి తనను రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించలేదని ఆయన ఆవేదనకు గురయ్యారు.


More Telugu News