ఒకే చితిపై నాలుగు కరోనా మృతదేహాల దహనం! 

  • మూడు చితులపై తొమ్మిది శవాల దహనం
  • కట్టెలు, సిబ్బంది కొరత అని చెప్పిన మున్సిపల్ కమిషనర్
  • అందుకే సామూహిక దహనాలు చేయాల్సి వస్తోందని వ్యాఖ్య
కరోనాతో చనిపోయిన వారి పట్ల అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటం సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. తాజాగా వరంగల్ లో అత్యంత ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కరోనా వల్ల ప్రాణాలను కోల్పోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను ఒకే చితిపై దహనం చేశారు. స్థానిక పోతన శ్మశానవాటికలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు చితులపై తొమ్మిది కంటే ఎక్కువ శవాలను తగలబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి స్పందించారు. సిబ్బంది కొరత, కట్టెల కొరత వల్లే ఒకే చితిపై ఎక్కువ శవాలను దహనం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆలస్యమైతే శవాలు డీకంపోజ్ అయిపోతాయని... అందుకే సామూహిక దహనాలు చేస్తున్నామని తెలిపారు. దహన కార్యక్రమాలకు మృతుల సొంత కుటుంబీకులే రావడం లేదని... ఇలాంటి పరిస్థితుల్లో తాము ఏం చేయగలమని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారమే మృతుల అంత్యక్రియలను నిర్వహిస్తున్నామని తెలిపారు.


More Telugu News