కరోనా వార్డుల్లో డాక్టర్ వేషంలో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్న మాయలాడి

  • విజయవాడ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్
  • చికిత్స పేరుతో ఫోన్లు తస్కరిస్తున్న వైనం
  • రోగుల బంధువుల నుంచి డబ్బు వసూలు
కరోనా రోగి దగ్గరకు వెళ్లాలంటేనే కుటుంబ సభ్యులు సైతం హడలిపోతున్న పరిస్థితుల్లో ఓ మాయలాడి ఏకంగా వైద్యురాలి వేషంలో కరోనా వార్డుల్లో తిరుగుతూ మొబైల్ ఫోన్లు కొట్టేస్తూ, రోగుల బంధువుల నుంచి డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతోంది. ఇప్పుడామె కటకటాల వెనక్కి చేరింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ వైద్యుల సంఖ్య కూడా ఎక్కువే. పీపీఈ కిట్ ధరిస్తే ఎవరు వైద్యులో, ఎవరు కాదో చెప్పడం చాలా కష్టం.

ఈ పాయింట్ ను ఆసరాగా చేసుకుని శైలజ (43) అనే మహిళ డాక్టర్ వేషం వేసి కరోనా వార్డుల్లో చోరీలకు తెరలేపింది. కరోనా పేషెంట్ల ఫోన్లు తస్కరించడమే కాదు, వారికి మెరుగైన సేవలు అందిస్తానని చెబుతూ రోగుల బంధువుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది. తమ వాళ్ల పరిస్థితి ఏంటో చెప్పండి అంటూ పలువురు ఆమెను ఆశ్రయించగా, వారి పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆమె అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. పీపీఈ కిట్ తో నిత్యం కరోనా వార్డుల్లో తిరుగుతున్న శైలజ గురించి సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి ప్రశ్నించబోగా పారిపోయింది.

మళ్లీ తర్వాత రోజు కూడా రావడంతో ఈసారి మహిళా సిబ్బంది వచ్చి పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శైలజను పోలీసులు ప్రశ్నించగా... తాను ప్రసాదంపాడులో ఉంటానని, తన భర్త పేరు సత్యనారాయణ అని వెల్లడించింది. తాను బీఏఎంస్ చదివానని తెలిపింది. కాగా, శైలజపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.


More Telugu News