అన్ లాక్ 3.0... లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించిన కేంద్ర ప్రభుత్వం! 

  • ఆగస్ట్ చివరి వరకు విద్యా సంస్థలు బంద్
  • రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత
  • సినిమా థియేటర్లు, మెట్రో రైల్, బార్లు మూసి ఉంచాలని ఆదేశం
దేశ వ్యాప్తంగా అన్ లాక్ 3.0ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు ఆంక్షలను సడలించిన కేంద్రం తాజాగా మరిన్ని సడలింపులను ఇచ్చింది. రాత్రి పూట కర్ఫ్యూని పూర్తిగా ఎత్తేసింది. కంటైన్మెంట్ జోన్లలో లేని ప్రాంతాల్లో ఆగస్ట్ 5 నుంచి జిమ్ లు, యోగా సెంటర్లను ప్రారంభించుకోవచ్చని తెలిపింది. విద్యా సంస్థలు, పబ్లిక్ పార్కులు, సినిమా హాల్స్ తెరవకూడదని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ఈరోజు విధివిధాలను విడుదల చేసింది.

ఆగస్ట్ చివరి వరకు స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలను తెరవకూడదని కేంద్రం తెలిపింది. మెట్రో రైల్ సర్వీసులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు మూసి ఉంచాలని చెప్పింది. సామాజికదూరంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవచ్చని ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, క్రీడా, మతపరమైన సభలకు అనుమతి లేదని తెలిపింది.

10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు, 65 ఏళ్లు దాటిన పెద్దలు, గర్భవతులు... బీపీ, డయాబెటిస్, గుండె, కిడ్నీ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఇంటి వద్దే ఉండాలని సూచించింది.


More Telugu News