అమెరికా పౌరుల ఇళ్ల ముందు చైనా నుంచి వచ్చిన విత్తనాల ప్యాకెట్లు.. ముట్టుకోవద్దని హెచ్చరిక!

  • వాషింగ్టన్, వర్జీనియా, టెక్సాస్‌లలో ఇళ్ల ముందు విత్తన ప్యాకెట్లు
  • వాటిని నాటితే ఇతర పంటలపై దుష్ప్రభావం చూపుతాయని హెచ్చరిక
  • భాష చూసి తమను నిందించొద్దన్న చైనా
తమ ఇళ్ల ముందు ఉన్న మెయిల్ బాక్సుల్లోని విత్తన ప్యాకెట్లను చూసిన అమెరికా వాసులు వణికిపోతున్నారు. వారి భయానికి కారణం అవి చైనా నుంచి రావడమే. వాషింగ్టన్, వర్జీనియా, టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో ఇవి దర్శనమిచ్చాయి. విషయం తెలిసిన వ్యవసాయ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. దయచేసి ఆ ప్యాకెట్లలో ఉన్న విత్తనాలను ఎవరూ నాటవద్దని, నాటితే అవి పంటలపై విపరీత ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. వాటిని అలాగే జాగ్రత్తగా దాచిపెడితే తామొచ్చి తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ విత్తన ప్యాకెట్లపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగంతో కలిసి ఆరా తీస్తున్నామని తెలిపారు.

శాస్త్రవేత్తలు కూడా ఈ విత్తనాలపై స్పందించారు. వీటిని నాటితే ఇతర పంటలపై దుష్ప్రభావం చూపడమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికా ఆందోళనపై చైనా స్పందించింది. తమ దేశ తపాలా వ్యవస్థ చాలా కచ్చితంగా ఉంటుందని, ప్యాకెట్లపై చైనా భాష ఉందని తమపై ఆరోపణలు తగవని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.


More Telugu News