భారత గగనతలంలోకి ప్రవేశించిన రాఫెల్ యుద్ధ విమానాలు.. వీడియో ఇదిగో!

  • ఫ్రాన్స్ నుంచి భారత్ కు చేరుకుంటున్న ఐదు రాఫెల్ జెట్లు
  • స్వాగతం పలికిన రెండు సుఖోయ్ విమానాలు
  • అంబాలాలో స్వాగతం పలకనున్న ఎయిర్ చీఫ్ మార్షల్
భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు చిరస్మరణీయమైన రోజు. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాలు మన గగనతలంలోకి ప్రవేశించాయి. కాపేపట్లో అంబాలా ఎయిర్ బేస్ కు అవి చేరుకోనున్నాయి. ఫ్రాన్స్ తయారు చేసిన ఈ ఫైటర్ జెట్లు తొలి విడతలో భాగంగా ఐదు భారత వాయుసేనలో భాగం కానున్నాయి. సోమవారం నాడు ఇవి ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరాయి. ఏడు గంటల ప్రయాణం తర్వాత యూఏఈలోని అల్ ధఫ్రా వైమానిక స్థావరంలో ఆగాయి.

భారత గగనతలంలోకి ప్రవేశించిన ఐదు ఫైటర్ జెట్లకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు స్వాగతం పలికి, వాటిని తోడ్కొని వస్తున్నాయి. భూమికి 30 వేల అడుగుల ఎత్తులో ఓ ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు ఇంధనాన్ని నింపుకున్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

మరోవైపు అంబాలాలో ల్యాండ్ అయ్యే విమానాలకు ఎయిర్ చీఫ్ మార్షల్ భదూరియా స్వాగతం పలకనున్నారు. చైనా దుందుడుకు చర్యలు ఎక్కువవుతున్న తరుణంలో రాఫెల్ జెట్లు కీలక పాత్ర పోషించబోతున్నాయని డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాఫెల్ యుద్ధ విమానాలను సుఖోయ్ విమానాలు తోడ్కొని వస్తున్న వీడియోను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.


More Telugu News