అలాంటి ఆసుపత్రులను గుర్తించాం.. కఠిన చర్యలు తీసుకుంటాం!: ఏపీ మంత్రి ఆళ్ల నాని
- కరోనా వైద్యాన్ని నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించాం
- ప్రజలు సహకరిస్తే కరోనాను సమర్థవంతంగా నియంత్రించగలం
- టెస్టుల ఫలితాలు 24 గంటల్లోగా వచ్చేలా చర్యలు తీసుకుంటాం
కరోనా వైద్యాన్ని నిరాకరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలను తీసుకుంటామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. వైద్యాన్ని నిరాకరిస్తున్న ఆసుపత్రులను ఇప్పటికే గుర్తించామని, వాటిపై చర్యలు తప్పవని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 17 వేల మంది వైద్య సిబ్బందిని తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలందరూ సహకరిస్తే కరోనాను సమర్థవంతంగా నియంత్రించగలమని చెప్పారు. రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ, కరోనా టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.