ఏమిటో.. నేనంటే ప్రజలెవరికీ ఇష్టం లేదు!: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలక

  • అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీని ఇష్టపడుతున్నారు
  • కరోనా కట్టడికి ఫౌచీని మా సర్కారే నియమించింది
  • ఆయన ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారు
  • నాకే అధికంగా మద్దతు రావాల్సి ఉంది.. రావట్లేదు
అమెరికా ప్రజలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలకబూనారు. తాజాగా ఆయన వైట్‌ హౌస్‌లో మాట్లాడుతూ...  తమ దేశ అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కంటే తనను ప్రజలు తక్కువగా ఇష్టపడుతున్నారని, అసలు తానంటే ఎవరికీ ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.

ఫౌచీని తమ సర్కారే నియమించిందని, ఆయన ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారని చెప్పారు. అమెరికాలో కరోనా కట్టడి కోసం  ఫౌచీతో పాటు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం సూచనలనే తమ సర్కారు అమలు చేసిందని చెప్పారు. అయితే, ఈ విషయంలో తనకే అధికంగా మద్దతు రావాల్సి ఉందని, అందుకు భిన్నంగా ఫౌచీకి వస్తోందని వ్యాఖ్యానించారు.

ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావట్లేదని, తనపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో తెలియట్లేదని చెప్పుకొచ్చారు. తన సర్కారు కోసం పనిచేసే వ్యక్తికి ప్రజలు మద్దతు ఇస్తూ, తనను మాత్రం ఇష్టపడకపోవడానికి తన వ్యక్తిత్వమే కారణమని ఆయన చెప్పారు. చివరకు, కరోనా కట్టడి బృందంలో తమ దేశ అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీనే ఉండాల్సిన అవసరం లేదని ఆయన మాట్లాడడం గమనార్హం. తమ ప్రభుత్వం వేరే ఎవరినైనా నియమించుకోవచ్చని చెప్పారు.


More Telugu News