93 ఏళ్ల వయసులో.. ఏడవ నిజాం కుమార్తె బషీరున్నీసా బేగం కన్నుమూత!

  • 1927లో జన్మించిన బషీరున్నీసా బేగం 
  • మీర్ ఉస్మాన్ 34 మంది సంతానంలో బతికున్న ఆఖరి మహిళ
  • అంతరించిన మీర్ ఉస్మాన్ తదుపరి తరం
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 34 మంది సంతానంలో జీవించివున్న ఏకైక కుమార్తెగా ఉన్న సాహెబ్ జాదీ బషీరున్నీసా బేగం కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. చార్మినార్ సమీపంలోని పురానీ హవేలీ, నిజాం మ్యూజియం ఆవరణలో ఉన్న ఉస్మాన్ కాటేజ్ భవనంలో ఆమె మరణించినట్టు బంధువులు తెలిపారు. 1906లో అజామ్ ఉన్నీసా బేగంతో మీర్ ఉస్మాన్ కు వివాహం కాగా, 1927లో బషీరున్నీసా బేగం జన్మించారు. ఈమె భర్త నవాబ్ ఖాజీంయార్ జంగ్ గతంలోనే మరణించారు.

కాగా, మీర్ ఉస్మాన్ కు 34 మంది సంతానం కాగా, ఇప్పటి వరకూ జీవించి ఉన్నది బషీరున్నీసా మాత్రమే. ఇప్పుడు ఆమె కూడా కన్నుమూయడంతో, మీర్ ఉస్మాన్ తదుపరి తరం అంతరించినట్లయింది. దక్కన్ హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే నగలను ధరిస్తూ, ఆమె ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉండగా, కుమారుడు దాదాపు 25 సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకూ అతని ఆచూకీ లభించక పోవడం గమనార్హం.

బషీరున్నీసా బేగం భౌతిక కాయాన్ని పురానీ హవేలీకి సమీపంలోనే ఉన్న మసీదుకు తరలించిన మత పెద్దలు, బంధువులు జనాజా నమాజ్ నిర్వహించారు. ఆమె మృతిపట్ల పలువురు సంతాపం వెలిబుచ్చారు. నిజాం మనవడు నవాబ్ జాఫ్ అలీఖాన్ నేతృత్వంలో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.


More Telugu News