ఏ వేడుక జరిగినా పార్వతీ పరమేశ్వరుల్లా వచ్చేవారు: రావి కొండలరావు మృతిపై చిరంజీవి స్పందన

  • నటుడు రావి కొండలరావు మృతి
  • పెద్ద దిక్కును కోల్పోయామన్న చిరంజీవి
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ నటుడు, సినీ, నాటక రచయిత రావి కొండలరావు మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమతో రావి కొండలరావుకు సుదీర్ఘ అనుబంధం ఉందని తెలిపారు. తాను హీరోగా పరిచయం అయిన తొలినాళ్ల నుండి రావి కొండలరావుతో అనేక చిత్రాల్లో నటించానని, తమ కాంబినేషన్ లో వచ్చిన మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయి వంటి చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. రావి కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడినే కాదు, గొప్ప రచయితను, జర్నలిస్టును, ప్రయోక్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

రావి కొండలరావు, ఆయన సతీమణి రాధాకుమారి అనేక చిత్రాల్లో కలిసి నటించారని, చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా పార్వతీ పరమేశ్వరుల్లా ఇద్దరూ కలిసి వచ్చి అభినందనలు, ఆశీస్సులు అందజేయడం చూడముచ్చటగా ఉండేదని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. రావి కొండలరావు మరణంతో చిత్రసీమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.


More Telugu News