కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసింది.. గెహ్లాట్ కు, కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పుతాం: మాయావతి

  • రాజస్థాన్ లో కాంగ్రెస్ కు షరతుల్లేకుండా మద్దతు ప్రకటించాం
  • కానీ మా ఎమ్మెల్యేలందరినీ లాక్కున్నారు
  • బీజేపీకి బీఎస్పీ కీలుబొమ్మ అని ప్రచారం చేస్తున్నారు
తమ ఎమ్మెల్యేలను లాక్కున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు త్వరలోనే గుణపాఠం నేర్పుతామని బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ తరపున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు గత ఏడాది కాంగ్రెస్ లో చేరారు. ఈ అంశంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్టు ఆమె చెప్పారు. రాజస్థాన్ అసెంబ్లీలో బలపరీక్షను నిర్వహిస్తే... కాంగ్రెస్ కు బీఎస్పీ తరపున గెలిచిన వారెవరూ ఓటు వేయకూడదని ఆమె హెచ్చరించారు.

రాజస్థాన్ అసెంబ్లీలో గెహ్లాట్ ప్రభుత్వానికి మ్యజిక్ ఫిగర్ కన్నా కేవలం ఒక్క సంఖ్య మాత్రమే ఎక్కువ ఉంది. 200 మంది ఎమ్మెల్యేలకు గాను... 101 మంది ఎమ్మెల్యేలు గెహ్లాట్ వెనుక ఉన్నారు. మాయావతి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే లేకపోతే ఇప్పటికే  కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేది. ఈ నేపథ్యంలో బీఎస్పీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మాయావతి వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ, ఈ అంశానికి సంబంధించి బీఎస్పీ గతంలోనే కోర్టును ఆశ్రయించిందని... అయితే, కాంగ్రెస్ పార్టీకి, సీఎం గెహ్లాట్ కు బుద్ధి చెప్పేందుకు తాము సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను లాక్కున్న అంశాన్ని ఇప్పుడు అంత తేలికగా వదిలేయబోమని... సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతామని అన్నారు.

రాజస్థాన్ లో దొంగ ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ చూడలేకపోతోందా? అని మాయ ప్రశ్నించారు. గెహ్లాట్ తప్పులు కాంగ్రెస్ నేతలకు కనిపించవని... బీఎస్పీని వేలెత్తి చూపించడమే వారికి తెలుసని మండిపడ్డారు. వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ కీలుబొమ్మ బీఎస్పీ అనే ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి షరతులు లేకుండానే కాంగ్రెస్ కు తాము మద్దతు ప్రకటించామని... అయితే, రాజ్యాంగ విరుద్ధంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ద్రోహం క్షమించలేనిదని చెప్పారు. ఆ పార్టీకి, గెహ్లాట్ కు గుణపాఠం నేర్పుతామని అన్నారు. బలపరీక్షలో కాంగ్రెస్ కు మద్దతుగా ఓటు వేయరాదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించామని... ఒకవేళ వారు కాంగ్రెస్ కు మద్దతు పలికితే, పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు.


More Telugu News