రెండు రోజుల్లో రూ.1500 పెరిగిన బంగారం ధర

  • 10 గ్రాముల పసిడి ధర రూ.52,301
  • నిన్న రాత్రి రూ.1066 లాభంతో రూ.52,101 వద్ద స్థిరపడిన ధర
  • ఈ రోజు ఉదయం ఇప్పటికే రూ.200ల పెరుగుదల
  • గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 2000 డాలర్లు
పసిడి ధర దేశీయంగా రెండు రోజుల్లో రూ.1500 పెరిగింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఈ రోజు ఉదయం 10 గ్రాముల పసిడి ధర రూ.52,301కి చేరింది. నిన్న రాత్రి రూ.1066 లాభంతో రూ.52,101 వద్ద స్థిరపడిన బంగారం ధర ఈ రోజు ఉదయం రూ.200ల లాభంతో రూ.52301 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లోనూ తొలిసారి ఔన్స్‌ బంగారం 2000 డాలర్లకు చేరింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.67,000గా ఉంది.

కరోనా కేసుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ప్యాకేజీలను ప్రకటించడంతో పసిడి ధర 2000 డాలర్లకు చేరడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 2 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందని అంటున్నారు. మరోవైపు, సమీప భవిష్యత్తులో పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో పసిడి డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు.


More Telugu News