అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా టీడీపీ ప్రజల పక్షమే: చంద్రబాబు

  • కరోనా సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు అభినందనలు
  • ముందుండి నిలిచేవాడే నాయకుడంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
  • తమది బాధ్యత గల ప్రతి పక్షం అంటూ వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ముందుండి నడిపించే నాయకత్వం అవసరం అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో నాయకుడు ధైర్యంగా ఉండడమే కాకుండా, ప్రజలకు మార్గదర్శిగా వ్యవహరించాలని అన్నారు. ఇటీవల తాను పిలుపునిస్తే టీడీపీ శ్రేణులు 175 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టాయని, కార్యకర్తలకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అవన్నీ పక్కనబెట్టి పేదలకు నిత్యావసరాలు అందించారని కొనియాడారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పంపించిన 2.5 లక్షల మాస్కులను కరోనాపై ముందు నిలిచి పోరాడుతున్న యోధులకు అందించారని వెల్లడించారు.

బాధ్యత గల ప్రతిపక్షంగా టీడీపీ వ్యవహరిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంతో బాధ్యతతో, నిబద్ధతతో సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నాయకులకు,కార్యకర్తలకు పేరుపేరునా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ సమయంలోనూ ప్రభుత్వం ఒత్తిడి పెంచే చర్యలకు దిగిందని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సరే అరెస్ట్ చేస్తున్నారని, అందుకు నలంద కిశోర్ ఉదంతమే నిదర్శనమని అన్నారు.


More Telugu News