అనుకున్నట్టుగానే.. సచిన్ పైలట్ వర్గంపై సుప్రీంలో వేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకున్న కాంగ్రెస్!

  • సమస్యను చర్చలతో పరిష్కరించుకోవాలని నిర్ణయం
  • ఈ ఉదయం సుప్రీంకోర్టుకు విషయం తెలిపిన కపిల్ సిబల్
  • తద్వారా గవర్నర్ ను ఇరకాటంలో పెట్టే వ్యూహం
అందరూ ఊహించినట్టుగానే రాజస్థాన్ లో తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను కాంగ్రెస్ విరమించుకుంది. ఈ సమస్య చాలా చిన్నదని, పార్టీలో చర్చించుకుని పరిష్కరించుకుంటే సరిపోతుందని సీనియర్ నేతలు ఒత్తిడి తేవడంతో, వారి అభిప్రాయాలను గౌరవించాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, ఈ ఉదయం సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే, తమ పిటిషన్ ను విరమించుకుంటున్నట్టు కాంగ్రెస్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టులో విచారణలో ఉన్న సమయంలో, విషయం తేలేంతవరకూ అసెంబ్లీని సమావేశ పరచరాదని గవర్నర్ కల్ రాజ్ మిశ్రా నిర్ణయించిన నేపథ్యంలో, కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పిటిషన్ ను వెనక్కు తీసుకోవడం ద్వారా గవర్నర్ ను ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహం కూడా కాంగ్రెస్ నిర్ణయం వెనకుంది.

కాగా, ఈ ఉదయం రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన కపిల్ సిబాల్, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పాటించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇది తమకు బాధను కలిగిస్తోందని, తమ క్లయింట్ తన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నారని,  తాము సమస్యను కొనసాగించాలని భావించడం లేదని తన వాదన వినిపించారు.


More Telugu News