ఆస్కార్ అవార్డు వల్లే ఏఆర్ రెహమాన్ కు బాలీవుడ్ లో సమస్యలు వచ్చాయంటున్న ప్రముఖ దర్శకుడు

  • తనకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ పనిచేస్తోందన్న రెహమాన్
  • బాలీవుడ్ చాన్సులకు అడ్డుతగులుతోందని ఆరోపణ
  • స్పందించిన దర్శకుడు శేఖర్ గుప్తా
ఎప్పుడూ తన సినిమాల గురించి తప్ప వేరే వ్యాఖ్యలు చేయని సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ తొలిసారిగా తనకు ఎదురవుతున్న అన్యాయం గురించి పెదవి విప్పాడు. బాలీవుడ్ లో ఓ గ్యాంగు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని, తనకు రావాల్సిన అవకాశాలకు అడ్డుపడుతోందని ఆరోపించాడు. దీనిపై ప్రముఖ ఫిలింమేకర్ శేఖర్ గుప్తా స్పందించారు.

"నీ సమస్యేంటో తెలుసా రెహమాన్? నువ్వు ఆస్కార్ కు నామినేట్ అవడమే కాకుండా విజేతగా కూడా నిలిచావు. అదే ఇక్కడ సమస్య. ఆస్కార్ కు వెళ్లిన వాళ్లంటే బాలీవుడ్ లో ఏమాత్రం గిట్టదు. ఎందుకంటే బాలీవుడ్ మోయగలిగిన దానికంటే ఎక్కువ ప్రతిభ నీలో ఉంది కాబట్టి.  అదే ఇప్పుడు నిరూపితమవుతోంది" అంటూ ట్వీట్ చేశారు.

దీనికి రెహమాన్ బదులిస్తూ, "పోయిన డబ్బును సంపాదించుకోవచ్చు, పోయిన పేరుప్రతిష్ఠలను మళ్లీ తెచ్చుకోవచ్చు. కానీ వృధా అయిన విలువైన సమయం ఎప్పటికీ తిరిగిరాదు. అయినాగానీ, శాంతి బాటలోనే నడుద్దాం. మనం మరెన్నో గొప్ప ప్రాజెక్టులు చేయాల్సి ఉంది" అంటూ వ్యాఖ్యానించారు.


More Telugu News