పాకిస్థాన్ దురాలోచన చేసింది: మన్‌కీ బాత్‌లో 'కార్గిల్‌ యుద్ధం' గురించి మోదీ

  • సైనికుల త్యాగాలు మరవలేం
  • సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తోంది
  • దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్య సాహసాలకు వందనం
  • 21 ఏళ్ల క్రితం ఇదే రోజు మన సైన్యం కార్గిల్ యుద్ధంలో గెలిచింది
దేశప్రజలను  ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో ప్రసంగిస్తున్నారు. కార్గిల్‌ యుద్ధం జరిగి 21 ఏళ్లు అవుతున్న సందర్భంగా దాని గురించి ఆయన మాట్లాడారు.

'సైనికుల త్యాగాలు మరవలేం.. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తోంది. దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్య సాహసాలకు ధన్యవాదాలు.  21 ఏళ్ల క్రితం ఇదే రోజు మన సైన్యం కార్గిల్ యుద్ధంలో గెలిచింది. భారత్‌ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తోంది. అంతర్గత సంఘర్షణల నుంచి దృష్టి మరల్చేందుకు పాక్ దురాలోచన చేసింది. భారత్ భూముల స్వాధీనం కోసం పాక్ దురాలోచన చేసింది' అని మోదీ వ్యాఖ్యానించారు.

'కార్గిల్  యుద్ధం మనకు రెండవ సూత్రాన్ని కూడా చెబుతోందని అటల్ జీ చెప్పారు. భారత్‌ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేముందు  తమ జీవితాలను త్యాగం చేసిన సైనికుడి గౌరవానికి అనుగుణంగా ఉంటుందా? లేదా? అనేది చూడాలని ఆయన చెప్పారు' అని మోదీ అన్నారు.

'మన దేశానికి హాని కలిగించే విషయాలను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో కొందరు నకిలీ పోస్టులు చేస్తుంటారు. వాటిని చాలా మంది షేర్ చేస్తుంటారు. యుద్ధాలు సరిహద్దుల్లో మాత్రమే జరగవు. అవి దేశంలోని వివిధ రంగాల్లోనూ జరుగుతుంటాయి. ప్రతి పౌరుడు అందులో తన పాత్రను నిర్ణయించుకోవాలి ఫేక్ న్యూస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి' అని మోదీ సూచించారు.   

'యుద్ధం జరిగినప్పుడు మనం చెప్పే విషయాలు, మన చర్యలు సరిహద్దులోని సైనికుడి ధైర్యంపై, అతని కుటుంబ మనోబలంపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. దీన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. అందుకే మన ప్రసంగాలు, ప్రకటనలు అన్నీ సైనికుల మనోధైర్యాన్ని పెంచేలా ఉండాలి' అని మోదీ అన్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..

కరోనాతో పోరాటానికి మరింత సమన్వయం అవసరమని మోదీ చెప్పారు. కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో కరోనాను తరిమికొడదామని చెప్పారు. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి మాస్కును తప్పకుండా ధరించాలని సూచించారు. మన దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువని చెప్పారు. కోలుకుంటోన్న వారి సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను రక్షించగలిగామని చెప్పారు. ముప్పు ఇంకా తొలగిపోలేదని, చాలా ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందని, అప్రమత్తంగా ఉందామని అన్నారు.


More Telugu News