ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిపై చెన్నై మహిళ ఫిర్యాదు.... తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేశాడని ఆరోపణ

  • పార్కింగ్ వద్ద వివాదం
  • మహిళ ఇంటి డోర్ వద్ద మూత్రం వాసన
  • సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన మహిళ
  • ఏబీవీపీ అధ్యక్షుడే మూత్రం పోసినట్టు వెల్లడి!
ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం తన నివాసం ముందు కక్షపూరితంగా మూత్రవిసర్జన చేశాడని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నైలోని నంగనల్లూర్ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో 60 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తోంది. ఏబీవీపీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం కూడా ఆ అపార్ట్ మెంట్ లోనే నివసిస్తున్నారు. అయితే, డాక్టర్ సుబ్బయ్యకు, వృద్ధురాలికి కారు పార్కింగ్ వద్ద వివాదం జరిగింది.

ఈ నేపథ్యంలో మరుసటి రోజు ఉదయం తమ ఇంటి తలుపు తీయగానే మూత్రం వాసన వస్తుండడంతో మహిళ సీసీటీవీ ఫుటేజి పరిశీలించింది. డాక్టర్ సుబ్బయ్య మూత్రవిసర్జన చేసినట్టు విజువల్స్ ద్వారా స్పష్టమైంది. ఈ వీడియో ఆధారాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడంలేదని ఆ మహిళ విచారం వ్యక్తం చేశారు. సుబ్బయ్య తన పలుకుబడి ఉపయోగించి పోలీసులను మేనేజ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై ఏబీవీపీ స్పందిస్తూ, ఆ వీడియో ఫేక్ అని కొట్టిపారేసింది. తమ అధ్యక్షుడ్ని అప్రదిష్ఠ పాల్జేయడానికే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.


More Telugu News