కొవిడ్ మందుల కొనుగోలు విషయంలో వెనకాడొద్దు.. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1000 కోట్లు: జగన్

కొవిడ్ మందుల కొనుగోలు విషయంలో వెనకాడొద్దు..  ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1000 కోట్లు: జగన్
  • 8 ఆసుపత్రులను క్రిటికల్ కేర్ ఆసుపత్రులుగా మార్చిన అధికారులు
  • క్రిటికల్ కేర్ కోసం 2,380 పడకలు అందుబాటులోకి
  • కేసుల సంఖ్య చూసి ఆందోళన పడొద్దన్న అధికారులు
ఏపీలో కరోనా ఆసుపత్రుల సంఖ్యను పెంచడంతోపాటు అందులో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే ఆరు నెలల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అలాగే, ఎంత ఖరీదైనా సరే కొవిడ్ రోగుల కోసం మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. జగన్ నిన్న తన క్యాంపు కార్యాలయంలో కొవిడ్-19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆశ్రం, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం జీజీహెచ్‌లను కొవిడ్ ఆసుపత్రులుగా మార్చనున్నట్టు అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా క్రిటికల్ కేర్ కోసం 2,380 పడకలు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. అనంతపురం, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆసుపత్రులలో క్రిటికల్ కేర్ సేవలు అందించేందుకు సిద్ధం చేసినట్టు తెలిపారు. మొత్తం 8 ఆసుపత్రులను క్రిటికల్ కేర్ ఆసుపత్రులుగా మార్చినట్టు అధికారులు వివరించారు. కేసుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్యులు, సిబ్బంది ఉండేలా చూడాలని, భోజనం, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.  

కేసుల తీవ్రత చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కంటైన్‌మెంట్ క్లస్టర్లు, హైరిస్క్ ప్రాంతాల్లోనే ఎక్కువ పరీక్షలు చేస్తున్నామని, అందుకే కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయని, ఆందోళన అవసరం లేదని చెప్పారు. అలాగే, కొవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు  రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ వంటి యాంటీ వైరల్‌ డ్రగ్‌లను పెద్ద మొత్తంలో ఆసుపత్రులలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర మందుల కొనుగోలు విషయంలో రాజీ పడొద్దని, ఖర్చుకు వెనకాడ వద్దని సీఎం సూచించారు.


More Telugu News