కరోనాతో కన్నుమూసిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడి సహాయకుడు

  • కరోనాతో ఈ నెల 15న ఆసుపత్రిలో చేరిక
  • బుకానన్ వద్ద సుదీర్ఘకాలం పనిచేసిన టిబెట్స్
  • సంతాపం తెలిపిన కాంగ్రెస్ సభ్యులు
అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు వెర్న్ బుకానన్ సహాయకుడు గ్యారీ టిబెట్స్ (66) నిన్న ఉదయం కరోనాతో మృతి చెందారు. ఫ్లోరిడా ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్టు బుకానన్ తెలిపారు. టిబెట్స్ 2011 నుంచి బుకానన్ వద్ద సహాయకుడుగా ఉంటున్నారు. న్యూ హ్యాంప్‌షైర్‌కు చెందిన టిబెట్స్ మాంచెస్టర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 26 ఏళ్లపాటు సెర్జెంట్‌గా పనిచేశారు. సుదీర్ఘకాలంగా తన వద్ద పనిచేస్తున్న గ్యారీ టిబెట్స్ మరణం తనను కలచివేసిందని బుకానన్ ట్వీట్ చేశారు. మనాటీ మెమోరియల్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. గ్యారీ నిజమైన ప్రజాసేవకుడు అని కొనియాడారు.

టిబెట్స్ ఈ నెల 15న కరోనాతో ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని బుకానన్ పేర్కొన్నారు. కాగా, కరోనాతో మరణించిన తొలి కాంగ్రెస్ సహాయకుడు టిబెట్సేనని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. గ్యారీ టిబెట్స్ మరణానికి ఫ్లోరిడా రిపబ్లికన్ మార్గరెట్ గుడ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఫ్లోరిడాలో ఇప్పటి వరకు 4 లక్షల మంది కరోనా బారినపడగా, 5,500 మంది కరోనాతో మరణించారు.


More Telugu News