నాలుగున్నర గంటలు.. 100కు పైగా ప్రశ్నలు.. అద్వానీని విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు

  • బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీని విచారించిన సీబీఐ కోర్టు
  • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారణ
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు
1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు... వరుస ప్రశ్నలను సంధించింది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది.

నాలుగున్నర గంటల సమయంలో సీబీఐ కోర్టు ఏకంగా 100కు పైగా ప్రశ్నలను సంధించిందంటే... విచారణ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా అద్వానీ తరపు లాయర్ మీడియాతో మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ అద్వానీ కొట్టిపడేశారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి విచారణను పూర్తి చేసి... ఆగస్టు 31వ తేదీలోగా సీబీఐ కోర్టు తీర్పును వెలువరించాల్సి ఉంది.

16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కూల్చివేశారు. రాముడు జన్మించిన స్థలంలో పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసి, ఈ మసీదును నిర్మించారని హిందూ ఉద్యమకారుల నమ్మకం.

మరోవైపు ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న బీజేపీ  సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్టేట్ మెంట్ ను సీబీఐ కోర్టు నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు చేసింది. రాజకీయ కారణాలతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఈ సందర్భంగా కోర్టుకు జోషి తెలిపారు.


More Telugu News