కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా ఆఫ్రికా మూలాలున్న వ్యక్తి... దేశంలో ఇదే తొలిసారి!

  • శాంతారాం సిద్దిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన కర్ణాటక గవర్నర్
  • సిద్ది సామాజికవర్గంలో శాంతారామే తొలి గ్రాడ్యుయేట్
  • అన్ని వర్గాల కోసం పాటుపడతానన్న శాంతారాం
కర్ణాటక గవర్నర్ విజు భాయ్ వాలా ఇటీవలే రాష్ట్ర శాసనమండలికి ఐదుగురు కొత్త సభ్యులను నామినేట్ చేశారు. వారిలో శాంతారాం బుద్నా సిద్ది ఒకరు. పేరు చూస్తే భారతీయత ఉట్టిపడుతున్నా, వాస్తవానికి శాంతారాం ఆఫ్రికా సంతతి వ్యక్తి. భారత చట్ట సభల్లోకి ఆఫ్రికా మూలాలున్న వ్యక్తులు ఇప్పటివరకు ప్రవేశించలేదు. కాగా, శాంతారాం కర్ణాటకలోని సిద్ది వర్గానికి చెందిన వ్యక్తి. సిద్ది ప్రజలు ఎన్నో ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి భారత్ వలస వచ్చి భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

ఇక శాంతారాం విషయానికొస్తే సిద్ది సామాజిక వర్గంలో ఆయన తొలి గ్రాడ్యుయేట్. ఆయన వనవాసి కల్యాణ్ ఆశ్రమ్ అనే గిరిజన సంక్షేమ సంస్థకు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఎమ్మెల్సీగా నామినేట్ అవడం పట్ల స్పందించారు. తమ జాతి మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయని భావిస్తుంటామని, బహుశా మొజాంబిక్, కెన్యా దేశాలు తమ పూర్వీకుల స్వస్థలాలు అయ్యుంటాయని తెలిపారు.

అప్పట్లో పోర్చుగీసు వారు ఆఫ్రికా నుంచి తమ పూర్వీకులను బానిసలుగా భారత్ తీసుకువచ్చారని, అప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతున్నామని వివరించారు. పోర్చుగీసు వారు వెళ్లిపోయాక పశ్చిమ కనుమల్లో ఆవాసం ఏర్పరచుకున్నామని, ప్రస్తుతం సిద్ది ప్రజలు కర్ణాటకలోని పశ్చిమ కనుమలు, గోవా, ముంబయిలో తప్ప భారత్ లో మరెక్కడా కనిపించరని శాంతారాం వెల్లడించారు. తమ జాతి ప్రజలు కొంకణి-మరాఠీల కలయికతో కొత్త భాష మాట్లాడుతుంటారని తెలిపారు.

శాసనమండలి సభ్యునిగా నామినేట్ అవడం ఎంతో సంతోషంగా ఉందని, తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కేవలం సిద్ది కమ్యూనిటీ కోసం మాత్రమే కాకుండా, హళక్కి వొక్కళిగ, కున్బి, ధంగర్ గావ్లీ తదితర తెగల ప్రజల సంక్షేమం కోసం కూడా పాటుపడతానని ఉద్ఘాటించారు.


More Telugu News