జగన్ చెప్పుడు మాటలు వింటారు.. ఆర్టికల్ 356 ఎంతో దూరంలో లేదు: వైసీపీకి రఘురాజు హెచ్చరిక

  • అనవసరంగా న్యాయ వ్యవస్థతో పెట్టుకోవద్దు
  • జగన్ సలహాదారులు సరైన సలహాలు ఇవ్వరు
  • న్యాయ వ్యవస్థను కించపరుస్తూ వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నారు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో  ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే శుక్రవారంలోగా నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన అనంతరం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ఇదే జరుగుతుందనే విషయం తనకు ముందే తెలుసని చెప్పారు. న్యాయ వ్యవస్థతో చీవాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అనవసరంగా న్యాయ వ్యవస్థతో పెట్టుకోవద్దని... ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు (రాజ్యాంగంలోని ఈ  ఆర్టికల్ కింద ఏ రాష్ట్రంలోనైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించవచ్చు).

చెప్పుడు మాటలు విని తమ ముఖ్యమంత్రి జగన్ తప్పుడు నిర్ణయాలను తీసుకుంటుంటారని రఘురాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చే సలహాలను జగన్ స్వీకరించరని... ఎంతోమంది సలహాదారులను ఆయన నియమించుకున్నారని, వారేమో సరైన సలహాలను ఇవ్వరని ఎద్దేవా చేశారు. న్యాయ వ్యవస్థను కించపరుస్తూ, దుర్భాషలాడుతూ కొంత మంది వైసీపీ నేతలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని... అలాంటి వారికి పార్టీ పెద్దలు సపోర్ట్ చేశారని విమర్శించారు. విమర్శలను స్వీకరించి సరిదిద్దుకోవాలని... మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటే... కోర్టులు చూస్తూ ఊరుకోవని అన్నారు. ఆర్టికల్ 356 ఎంతో దూరంలో లేదనే సంగతిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు.


More Telugu News