60 మంది ఎయిర్ ఇండియా పైలట్లకు కరోనా: పైలట్ల సంఘం

  • వందేభారత్ మిషన్‌లో సేవలు అందించిన పైలట్లకు కరోనా
  • విమానయాన మంత్రికి లేఖ రాసిన సంఘం
  • విపత్కర సమయంలో సేవలు అందిస్తున్న తమకు వేతనాల్లో కోత సరికాదని ఆవేదన
కరోనా లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల ‘వందేభారత్’ మిషన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో చిక్కుకుపోయి వారిని ఎయిర్ ఇండియా విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ మిషన్‌లో భాగంగా సేవలు అందించిన పైలట్లలో 60 మంది కరోనా మహమ్మారి బారినపడినట్టు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలట్స్ సంఘం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరికి లేఖ రాసింది.

మొత్తం 137 దేశాల నుంచి 5,05,990 మందిని వెనక్కి తీసుకొచ్చినట్టు ఆ లేఖలో పేర్కొన్న సంఘం.. ఈ కష్టకాలంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరింది. మహమ్మారిని లెక్కచేయకుండా విధుల్లో పాల్గొంటున్న తమ పైలట్ల వేతనాల్లో కోతలు సరికాదని, దీనివల్ల పైలట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.


More Telugu News