విజయానికి తుది మెట్టుపై ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్!

  • మూడవ దశలోకి వ్యాక్సిన్ ప్రయోగాలు
  • బిలియన్ డోస్ లను సిద్ధం చేస్తున్న ఆస్ట్రాజెనికా
  • వ్యాక్సిన్ ప్రభావం చూపే కాలంపై తొలగని అనుమానాలు
బ్రిటన్ కేంద్రంగా నడుస్తున్న ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, స్వీడన్ సంస్థ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్, తొలి రెండుదశలనూ విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రపంచ మానవాళికి ఆశాదీపంలా కనిపించింది. ఏప్రిల్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం కాగా, రెండు దశల ఫలితాలు రెండు వారాల క్రితం విడుదల అయ్యాయి. ఇప్పుడు మూడవ దశ ట్రయల్స్ సాగుతుండగా, అవి కూడా విజయవంతం అవుతున్నట్టు సమాచారం.

మూడవ దశలో పెద్దఎత్తున వలంటీర్లను ఎంచుకున్న ఆక్స్ ఫర్డ్ వారికి వ్యాక్సిన్ ఇచ్చింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం, వీరి శరీరంలో కరోనాను ఎదుర్కొనే నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. ఇక ఫేజ్ 3 డేటాను నిశితంగా పరిశీలించిన ఆస్ట్రాజెనికా, వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేసింది. ప్రపంచానికి తాము హామీ ఇచ్చినట్టుగా బిలియన్ డోస్ లను అందించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 2021 ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి అందించాలని కృషి చేస్తోంది.

కాగా, వ్యాక్సిన్ సిద్ధమవుతోందన్న విషయమై ఎటువంటి సందేహాలు లేకపోగా, ఈ వ్యాక్సిన్ శరీరంలో ఎంతకాలంపాటు యాంటీ బాడీలను పెంచుతుంది? అవి కరోనా సోకకుండా ఎంతకాలం రక్షణను కల్పిస్తాయన్న విషయమై వస్తున్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు. ఈ వైరస్ కొన్ని దశాబ్దాల పాటు మానవులను వదిలి పెట్టబోదని ఆరోగ్య రంగంలోని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నా ఎంత కాలం రక్షణ పొందుతామన్న విషయమై స్పష్టత ఇంకా రాలేదు. ఏదిఏమైనా, ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రావాలని మానవాళి కోరుకుంటోంది.


More Telugu News