కరోనా కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరుకుందని ఎలా ప్రకటిస్తారు?: వైద్యాధికారులపై ఈటల ఫైర్

  • దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయన్న ఈటల
  • రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి లేదని వ్యాఖ్య
  • కోవిడ్ ఆసుపత్రుల్లో సరిపడా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశం
తెలంగాణలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి స్థాయికి చేరుకుందని వైద్యాధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన అధికారులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరుకుందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని తెలిపారు.

మరోవైపు, కరోనా చికిత్సకు కీలకంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో దాదాపు రెండు గంటల సేపు కరెంట్ పోవడం కలకలం రేపింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కరోనా పేషెంట్లు చీకటిలో ఇబ్బంది పడ్డారు. రోగులకు చికిత్స అందించడానికి వైద్యులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీనిపై ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. కోవిడ్ ఆసుపత్రుల్లో జనరేటర్లను చెక్ చేసి పెట్టుకోవాలని, సరిపడా డీజిల్ నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ జనరేటర్లు సరిపోకపోతే... ప్రైవేట్ జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


More Telugu News