ఆశించింది జరగకపోవడంతో కాంగ్రెస్ నేతలు చింతిస్తున్నారు: జేడీఎస్ నేత కుమారస్వామి

  • బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ భావించింది
  • అధికారాన్ని చేపట్టవచ్చని కలలు కన్నది
  • గతం గురించి మాట్లాడుకోవడం వల్ల లాభం లేదన్న సిద్ధరామయ్య 
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన మరోసారి కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ ఆశించిందని... వారి కలలు కల్లలయ్యాయని అన్నారు.

ఆరు నెలల్లోగా బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని, ఆ తర్వాత తాము అధికారాన్ని చేపట్టవచ్చని కాంగ్రెస్ భావించిందని చెప్పారు. అయితే, ఏమీ జరగకపోవడంతో కాంగ్రెస్ నేతలు చింతిస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తాము అస్థిరపరచబోమని చెప్పారు. జేడీఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సంకీర్ణ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.

అయితే కుమారస్వామి మాటలను కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేలికగా తీసుకున్నారు. గతం గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల లాభం లేదని చెప్పారు. మరో ఏడాది పాటు బీజేపీ ప్రభుత్వం కొనసాగవచ్చని జోస్యం చెప్పారు.


More Telugu News