వైసీపీకి ఇంత మెజారిటీ రావడానికి కారణం ఎస్సీలు కాదా?: మాజీ ఎంపీ హర్షకుమార్

  • రాజమండ్రిలో హర్షకుమార్ మీడియా సమావేశం
  • దళితులపై దాడులు ఎక్కువవుతున్నాయంటూ ఆందోళన
  • ప్రభుత్వంపై అనుమానం కలిగే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యలు
ఇటీవల రాష్ట్రంలో దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఇంత మెజారిటీ వచ్చిందంటే అందుకు ఎస్సీలు కారణం కాదా? అని ప్రశ్నించారు. రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రత్యేకించి ఎస్సీలపైనే దాడులు జరుగుతుండడం చూస్తుంటే ప్రభుత్వంపై అనుమానం కలిగే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

"రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను పోలీసు స్టేషన్ వద్ద వదిలేశారు. అక్కడ పోలీసులు ఆ బాలికను కొట్టి పంపించి వేశారు. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరికి కరోనా ఉండడంతో ఆ అమ్మాయికి కూడా కరోనా వచ్చింది. చీరాలలో మాస్కు పెట్టుకోలేదని ఓ యువకుడ్ని కొట్టి చంపారు. ఈ ఘటనకు కారకుడైన ఎస్సైపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయకుండా, బాధితులకు ముష్టి వేసినట్టు ఓ రూ. 10 లక్షలు ఇచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేశారు. ఇది జాతి ఆత్మగౌరవంపై దెబ్బకొట్టడమే. ఈ ఘటనను దళితజాతి క్షమించదు. శిరోముండనం ఘటన పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా జరగదు. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే శిరోముండనం ఘటనలో కాల్ డేటాను వెల్లడించాలి. నిర్ణీత గడువులోగా న్యాయ విచారణ జరిగేలా చూడాలి" అంటూ డిమాండ్ చేశారు.


More Telugu News