ధ్రువాస్త్ర టెస్ట్ ఫైర్ విజయవంతం... త్వరలో భారత్ అమ్ములపొదిలో'ట్యాంక్ కిల్లర్'

  • ట్యాంకులను తుత్తునియలు చేసే ధ్రువాస్త్ర  
  • చాందీపూర్ రేంజ్ లో పరీక్ష
  • లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిన ట్యాంక్ కిల్లర్
శత్రువుల యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే 'ధ్రువాస్త్ర' యాంటీ టాంక్ మిస్సైల్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ ఫైరింగ్ రేంజ్ లో ఇవాళ నిర్వహించిన పరీక్షలో 'ధ్రువాస్త్ర' నిర్దేశిత లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించింది. హెలికాప్టర్ కు అమర్చి శత్రు ట్యాంకులపైకి ప్రయోగించే ఈ యాంటీ టాంక్ క్షిపణిని త్వరలోనే భారత బలగాలకు అప్పగించనున్నారు. 'ధ్రువాస్త్ర' మిస్సైల్ ను డీఆర్డీవో దేశీయంగా రూపొందించింది.

'నాగ్' శ్రేణిలో ఇప్పటివరకు అనేక యాంటీ టాంక్ మిసైళ్లను రూపొందించిన డీఆర్డీవో తాజాగా 'ధ్రువాస్త్ర' క్షిపణిలో అత్యాధునిక పరిజ్ఞానం పొందుపరిచింది. అమెరికాకు చెందిన 'జావెలిన్' యాంటీ ట్యాంక్ మిస్సైల్ తరహాలో ఒక్కసారి ప్రయోగించిన తర్వాత డిజిటల్ ఇమేజింగ్ విధానంలో లక్ష్యాన్ని గుర్తిస్తూ దూసుకుపోతుంది. మొదట యుద్ధ ట్యాంకు ఉపరితలాన్ని ఛేదిస్తుంది. ఆపై ట్యాంకు లోపలి భాగాన్ని నాశనం చేస్తుంది. ఫలానా ప్రాంతంలో ట్యాంకు ఉందంటూ ఒక్కసారి లక్ష్యం నిర్దేశించిన తర్వాత దీన్ని ఆపడం ఇక ఎవరితరం కాదు. అందుకే దీన్ని 'ట్యాంక్ కిల్లర్' గా పిలుస్తారు.


More Telugu News