ఇక్కడ కరోనాను పెంచి.. పక్క రాష్ట్రాల్లో చికిత్స చేయించుకుంటున్నారు: దేవినేని ఉమ

  • వైసీపీ కార్యక్రమాల వల్లే కరోనా విస్తరించింది
  • కరోనాపై జగన్ బాధ్యతారహితమైన ప్రకటనలు చేశారు
  • సీఎం మాస్క్ కూడా ధరించడం లేదు
విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో విజయసాయి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అట్టహాసంగా చేపట్టిన నిత్యావసరాల పంపిణీ, మార్కెట్ కమిటీ ప్రారంభోత్సవాలు, ఊరూ వాడా జయంతి ఉత్సవాలతో కరోనా వ్యాప్తి చెందిందని విమర్శించారు. ఏపీలో కట్లు తెంచి కరోనాను పోషించిన మీ ప్రజాప్రతినిధులు పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... ఇదే సౌకర్యాన్ని ప్రజలకు కూడా కల్పించాలి జగన్ గారూ అని వ్యాఖ్యానించారు.

కరోనా గురించి జగన్ బాధ్యతారహితమైన ప్రకటనలు చేశారని మండిపడ్డారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుంది, కరోనా ఎవరికైనా వస్తుంది, పోతుంది, కరోనా కేసులు పెరుగుతూ పోతాయి, రాబోయే రోజుల్లో కరోనా రాని వారు ఎవరూ ఉండరని మీరు చెప్పిన మాటలను ఈరోజు నిజం చేసి చూపించారని మండిపడ్డారు. మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏయే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో చెప్పే ధైర్యం మీకు ఉందా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికారుల వరకు ఎవరూ మాస్కులు పెట్టుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతలెవరూ కరోనా నిబంధనలను పాటించలేదని... కరోనా పెరగడానికి మీరే కారణమని ఆరోపించారు. మీరు చేసిన తప్పులకు సామాన్యులు బాధపడుతున్నారని చెప్పారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ లభించడం లేదని దుయ్యబట్టారు. 24 గంటల్లో 6,045 కొత్త కేసులు నమోదయ్యాయని, 65 మంది ప్రాణాలు కోల్పోయారని... మీరు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు జగన్ గారూ? అని ప్రశ్నించారు.


More Telugu News