నిమ్స్‌లో మరో వ్యక్తికి కరోనా 'కోవాగ్జిన్'

  • నిమ్స్ లో ఇప్పటికే ఇద్దరికి కోవాగ్జిన్
  • ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేల్చిన వైద్యులు
  • కాసేపట్లో ఓ వ్యక్తికి కోవాగ్జిన్ ఇస్తామని ప్రకటన
కరోనా వైరస్‌ను నిరోధించే క్రమంలో వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కలిసి కోవాగ్జిన్‌ పేరిట వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లోని నిమ్స్ ‌ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సిన్‌ తయారీ బృందం మొదటి దశ ట్రయల్స్‌ ప్రారంభించింది.

క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా మూడు రోజుల క్రితం ఇద్దరు వాలంటీర్లకు తొలి డోస్‌లు ఇచ్చారు. వారిని ఐసీయూలో ఉంచి 24 గంటలపాటు వైద్య బృందం పర్యవేక్షించిన అనంతరం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో డిశ్ఛార్జి చేశారు. వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. అయితే, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

దీంతో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేశారు. ఈ రోజు మరో వాలంటీరుకు ఫేజ్‌-1 డోస్‌ ఇచ్చేందుకు నిమ్స్‌ ఆసుపత్రి వర్గాలు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కాసేపట్లో ఓ వ్యక్తికి కోవాగ్జిన్ ఇచ్చి అతడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. కాగా, దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే. కోవాగ్జిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతినిచ్చింది.


More Telugu News