నెల రోజుల వ్యవధిలో 50కి పైగా సమావేశాలు నిర్వహించిన నరేంద్ర మోదీ!

  • లాక్ డౌన్ కారణంగా కార్యాలయం, ఇంటికే పరిమితం
  • పలు విభాగాల అధికారులతో ఆన్ లైన్ సమావేశాలు
  • ఆర్థిక వృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని
కరోనా కట్టడి నిమిత్తం లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా ఇంటికి, కార్యాలయానికి మాత్రమే పరిమితమైన ప్రధాని నరేంద్ర మోదీ, గడచిన నెల రోజుల వ్యవధిలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 50కి పైగా సమావేశాలను నిర్వహించారు. ఆర్థిక సంస్కరణల అమలు దిశగానే వీటిల్లో అత్యధిక సమావేశాలు జరిగాయి. వివిధ సెక్టార్ల వారీగా కీలక నిర్ణయాలు తీసుకుని, పలు విభాగాల్లో ఉన్న అడ్డంకులను తొలగించే దిశగా ప్రధాని సమీక్షలు నిర్వహించారు.

సాధారణంగా జరిగే సమావేశాలు, ప్రజా సభలు జరగని నేపథ్యంలో ప్రధాని అత్యధిక సమావేశాలు ఆన్ లైన్ మాధ్యమంగానే సాగాయి. ప్రధానితో ఉన్నతాధికారులు దాదాపు 1000 పని గంటల పాటు సమావేశమయ్యారు. ఒక్కో సమావేశంలో సరాసరిన 10 మంది అధికారులు, రెండు గంటల పాటు పాల్గొన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో కరోనా కారణంగా పతనమైన ఆర్థిక వృద్ధిని పెంచేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై మేధోమధనం జరిగిందని తెలిపాయి.

మౌలిక వసతుల కల్పన, సాంకేతికతను మరింతగా వినియోగించుకోవడం, ఆరోగ్య పరిరక్షణ, పన్ను విధానం, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై నరేంద్ర మోదీ చర్చలు సాగాయి. ఇక వివిధ నౌకాశ్రయాల్లో మిగిలివున్న భూమిని సక్రమంగా వినియోగించుకోవాలని, పన్ను విధానంలో మరింత పారదర్శకత రావాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసుల విధానం, యూపీఐ, డీబీటీ స్కీమ్ ల మరింత వినియోగం అంశాలపై మోదీ నిర్ణయాలు తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


More Telugu News