నిమ్మగడ్డ రమేశ్ కు అంత డబ్బు ఎవరిస్తున్నారు?: శ్రీకాంత్ రెడ్డి

  • గవర్నర్ నిర్ణయాన్ని గౌరవిస్తాం
  • నిమ్మగడ్డ కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని గవర్నర్ కు తెలియజేస్తాం
  • కోట్ల రూపాయలు తీసుకునే లాయర్లను నిమ్మగడ్డ పెట్టుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ లపై వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. నిమ్మగడ్డ రమేశ్ ను ఎస్ఈసీగా కొనసాగించాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను తాము గౌరవిస్తామని చెప్పారు.

నిమ్మగడ్డ రమేశ్ ను ఎస్ఈసీగా పరిగణించమని గవర్నర్ చెప్పారని... అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి, ఏం జరుగుతుందో వేచి చూడాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్న విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోట్ల రూపాయల ఫీజు తీసుకునే లాయర్లను నిమ్మగడ్డ పెట్టుకున్నారని... ఆయనకు ఈ డబ్బును ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. డబ్బు చంద్రబాబు ఇస్తున్నారా? అని అన్నారు. తనకు సంబంధించిన వ్యక్తులు కీలక పదవుల్లో ఉండేలా చంద్రబాబు తెర వెనుక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ హోటళ్లలో రహస్యంగా మంతనాలు జరిపారని విమర్శించారు.


More Telugu News