హైకోర్టు వ్యాఖ్యలతో పాలకుల నిజస్వరూపం బట్టబయలైంది: విజయశాంతి ఆగ్రహం

  • కరోనాను నియంత్రించే అవకాశాలున్నా నిర్లక్ష్య ధోరణి
  • సర్కారు పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టింది
  • అధికార యంత్రాంగాన్ని హైకోర్టు మందలించింది
  • బదులివ్వలేక తెలంగాణ సర్కారు నీళ్లు నమలాల్సి వచ్చింది
కరోనాను కట్టడి చేయలేపోతున్నారంటూ తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. 'కరోనాను నియంత్రించే అవకాశాలున్నా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టింది. కేసులు పెరుగుతుంటే నిజాలను మరుగుపరిచి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని నిప్పులు చెరిగింది. తమ ఆదేశాల అమలుకు ఇదే చివరి అవకాశమని న్యాయస్థానం హెచ్చరించేలా పరిస్థితి దిగజారింది' అని విజయశాంతి ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

'అధికార యంత్రాంగాన్ని తాము ఇంతగా మందలిస్తుంటే... మెచ్చుకున్నట్టు చెప్పుకుంటున్నారన్న న్యాయస్థానం వ్యాఖ్యలతో పాలకుల నిజస్వరూపం బట్టబయలైంది. చికిత్సను అందించడంలో ఐసీఎంఆర్ నిబంధనలను గాలికొదిలేశారన్న కోర్టు వ్యాఖ్యలకు బదులివ్వలేక తెలంగాణ సర్కారు నీళ్లు నమలాల్సి వచ్చింది. ఇది చాలక మరోవైపు ప్రైవేట్ నర్సుల దుస్థితిపై హెచ్చార్సీ నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు నోటీసులు అందుకున్నారు. తాము ఎన్నుకున్న పాలకుల ఈ నిర్వాకాలతో జనం కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి నెలకొంది' అని విజయశాంతి విమర్శలు గుప్పించారు.


More Telugu News