కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. శివంగిలా లంఘించి ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి పారేసిన బాలిక

  • ఆఫ్ఘనిస్థాన్‌లోని సెంట్రల్‌ఘర్ ప్రావిన్స్‌లో ఘటన
  • ఇంటికొచ్చి బాలిక తల్లిదండ్రులను కాల్చి చంపిన ఉగ్రవాదులు
  • ఉగ్రవాదులపై బాలిక అసమాన పోరాటం
తన కళ్లముందే తల్లిదండ్రులను విచక్షణ రహితంగా కాల్చి చంపిన ఉగ్రవాదులపై సింగంలా దూకిందో 15 ఏళ్ల బాలిక. ఏమాత్రం భయం లేకుండా తుపాకి అందుకుని వారిపై తూటాల వర్షం కురిపించింది. వారిని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని సెంట్రల్‌ఘర్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

గ్రామ పెద్ద ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుండడం తాలిబన్లకు కోపం తెప్పించింది. దీంతో అతడ్ని హతమార్చాలని నిర్ణయించుకుని ఈ నెల 17న అతడి ఇంటికి వచ్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వెళ్లి తలుపుకొట్టారు. తలుపు తీసిన బాలిక కమర్‌గుల్ తల్లి తలుపు తీసింది. అయితే, వచ్చింది ఉగ్రవాదులని తెలుసుకున్న వెంటనే అప్రమత్తమై తలుపులు మూసేసింది.

దీంతో ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపి లోపలికి ప్రవేశించి బాలిక తండ్రిని కూడా కాల్చి చంపారు. తన కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపడంతో బిక్కచచ్చిపోయిన బాలిక ఆ వెంటనే తేరుకుంది. ఇంట్లో ఉన్న ఏకే-47 తుపాకి తీసుకుని ఉగ్రవాదులు ముగ్గురినీ కాల్చి పారేసింది. అంతేకాదు, తనను చంపేందుకు ప్రయత్నించిన మరికొందరు ఉగ్రవాదులతో గంటకుపైగా వీరోచితంగా తలపడింది. తనతోపాటు ఉన్న 12 ఏళ్ల తమ్ముడిని కాపాడుకుంటూనే ఉగ్రవాదులతో పోరాడింది. ఈ లోగా విషయం తెలిసిన గ్రామస్థులు, ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లు ఆమెకు సాయంగా రావడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. బాలిక కాల్పుల్లో ఉగ్రవాదుల్లో కొందరు గాయపడ్డారు. కాగా, ఉగ్రవాదులపై అసమాన పోరాట ప్రతిభ చూపిన బాలిక కమర్, ఆమె తమ్ముడిని అధ్యక్షుడు అష్రఫ్ ఘని అభినందిస్తూ, తమ అధికార నివాసానికి వారిని ఆహ్వానించారు.


More Telugu News