చిత్తూరులో కొవిడ్‌కు చికిత్స పొందుతూ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన బాధితుడు

  • జిల్లా క్షయ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో నిన్న పరీక్షల నిర్వహణ
  • అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగి హాజరు
కరోనాకు చికిత్స పొందుతున్న ఓ బాధితుడు ఉద్యోగ పరీక్ష రాయడం చిత్తూరులో కలకలం రేపింది. జిల్లా క్షయ విభాగంలోని ఆర్ఎన్‌టీసీపీ కింద కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పట్లోనే ఉద్యోగాల భర్తీ పూర్తయింది. అయితే, ఒకరిద్దరికి ఉద్యోగం రాకపోవడంతో నోటిఫికేషన్ రద్దు చేసి కొన్ని మార్పులతో మరోమారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా నిన్న మరోమారు పరీక్షలు నిర్వహించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థి ప్రస్తుతం కొవిడ్ బారినపడి జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇక్కడ సమావేశ మందిరంలో నిన్న నిర్వహించిన పరీక్షలకు చికిత్స పొందుతున్న బాధితుడు కూడా హాజరు కావడం కలకలం రేపింది. విషయం కాస్తా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశం కావడంతో జిల్లా క్షయ నివారణ విభాగం అధికారి రమేశ్ బాబు స్పందించారు. నిన్న ఉదయం బాధితుడికి నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో ఫలితం నెగటివ్ అని రావడంతో డీఎంహెచ్ఓ అనుమతితోనే అతడిని పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చినట్టు వివరించారు.


More Telugu News