ఇంకెందుకు? ఒకే దేశం - ఒకే పార్టీ అనేయండి: మమతా బెనర్జీ నిప్పులు

  • ఇద్దరు సోదరులు నాశనం చేస్తున్నారు
  • ప్రజాస్వామ్యం అనే మాట కూడా వినపడకుండా చేయాలని చూస్తున్నారు
  • రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ పైనే వారి కన్ను
  • మోదీ, అమిత్ షాలపై మమతా బెనర్జీ మండిపాటు
ఇండియాలో ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోందని, ప్రజాస్వామ్యం అన్న మాట కూడా వినపడకుండా చేయాలని ఇద్దరు సోదరులు మోదీ, షాలు ప్రయత్నిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మరేమీ ఉండరాదన్నది ఆ 'టూ బ్రదర్స్' ఉద్దేశంలా కనిపిస్తోందని ఆమె అన్నారు. తాజాగా పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె, ఇక వారిద్దరూ కలిసి "ఒకే దేశం - ఒకే పార్టీ అనేయవచ్చు" అని అన్నారు.

"మిగతా అన్ని రాష్ట్రాలనూ గుజరాత్ మాత్రమే పాలించాలా? ఈ ఇద్దరు సోదరుల పరిపాలనను మేము అంగీకరించబోము. ప్రజాస్వామ్య వ్యవస్థ అవసరమే లేకుండా చేయాలని వారు అనుకుంటున్నారు. ఇక ఒకే దేశం - ఒకే పార్టీ అనేయండి" అంటూ మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. "కరోనా మహమ్మారితో దేశం యావత్తూ పోరాడుతున్న వేళ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అస్థిర పరచాలని వారు భావిస్తున్నారు. మధ్య ప్రదేశ్ తరువాత వారి కన్ను రాజస్థాన్ పై, పశ్చిమ బెంగాల్ పై పడింది" అని విమర్శించారు.

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఓ విఫలమైన పార్టీ అని, గుజరాత్ నుంచి వచ్చి తమను పాలించాలని భావించే వారిని ఇక్కడి ప్రజలు తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మమతా బెనర్జీ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలను బీజేపీ ఎంతమాత్రమూ పట్టించుకోవడం లేదని, ఇక్కడివారిని నిత్యమూ బీజేపీ అవమానాలకు గురిచేస్తేందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ తరహా ఆటవిక పాలన, ఎన్ కౌంటర్ల రాజ్యాన్ని ఇక్కడి వారెవరూ అంగీకరించే ప్రసక్తే లేదని దుయ్యబట్టారు.


More Telugu News