ఇండియాపై దాడి సరికాదు... చైనాకు వ్యతిరేకంగా బిల్లును ఆమోదించిన యూఎస్!

  • ప్రతినిధుల సభ తీర్మానం
  • ఏకగ్రీవంగా ఆమోదించిన సభ
  • బిల్లును ప్రవేశపెట్టిన స్టీవ్ చాబాట్, అమీ బెరా
ఇండియాకు వ్యతిరేకంగా చైనా తీసుకుంటున్న చర్యలు సరికావంటూ, అమెరికా ప్రతినిధుల సభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు ఎన్డీఏఏ (నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్)కు సవరణలు చేస్తూ, ఏకగ్రీవంగా ఓ తీర్మానం ఆమోదం పొందింది. గాల్వాన్ లోయలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, చైనా చర్యల కారణంగా  దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడినటువంటి పరిస్థితులే హిమాలయ  పర్వత ప్రాంతాల్లోనూ ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేసింది.

యూఎస్ కాంగ్రెస్ మెన్ స్టీవ్ చాబాట్, భారత సంతతికి చెందిన మరో ప్రజా ప్రతినిధి అమీ బెరా కలసి ఈ బిల్లును సోమవారం నాడు సభలో ప్రవేశపెట్టారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలూ కృషి చేయాలని వారు సూచించారు. దీనికి ఇతర సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలికారు. కాగా, గత మే నెలలో సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు 20 మందికి పైగా భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. చైనా మాత్రం ఇంతవరకూ తమ వైపున ఎంతమంది మరణించారన్న విషయాన్ని వెల్లడించలేదు.


More Telugu News