వరుసగా రెండో ఏడాది కూడా రద్దయిన అమర్ నాథ్ యాత్ర... నిరాశలో భక్తులు

  • కరోనా నేపథ్యంలో అమర్ నాథ్ యాత్ర రద్దు
  • ఆర్టికల్ 370 రద్దు కారణంగా గత ఏడాది కూడా రద్దు
  • పూజా కార్యక్రమాలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నామని ప్రకటించిన బోర్డు
హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో వెళ్లే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది కూడా రద్దయింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు అమర్ నాథ్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ యాత్ర రద్దు కావడం వరుసగా ఇది రెండో ఏడాది. గత ఏడాది యాత్ర కొనసాగుతున్న సమయంలో అప్పటికప్పుడే కేంద్ర ప్రభుత్వం యాత్రను రద్దు చేసి, భక్తులను వెనక్కి పిలిపించింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసే నేపథ్యంలో గత ఏడాది యాత్రను రద్దు చేశారు.

ఈ సందర్భంగా అమర్ నాథ్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది. 'ప్రస్తుతం నెలకొన్న కరోనా మహమ్మారి నేపథ్యంలో పవిత్ర అమర్ నాథ్ యాత్రను రద్దు చేస్తున్నాం. బాధాతప్త హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నాం. అమర్ నాథ్ లో జరిగే పూజా కార్యక్రమాలను టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తాం. భక్తులందరూ లైవ్ టెలికాస్ట్ ద్వారా స్వామిని దర్శించుకోవాలని విన్నవిస్తున్నాం. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఉదయం, సాయంత్రం జరిగే హారతి కార్యక్రమాలను టెలికాస్ట్ చేయనున్నాం. ఇతర అన్ని క్రతువులు గతంలో మాదిరే ఈ ఏడాది కూడా జరుగుతాయి.

కరోనా వైరస్ అంశంపై బోర్డు క్షుణ్ణంగా చర్చించింది. ఈ నెలలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. హెల్త్ వర్కర్లు, సెక్యూరిటీ బలగాలు, సివిల్, పోలీసు సిబ్బంది అంతా కరోనాను కట్టడి చేయడంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో యాత్రకు వచ్చే వారికి అన్ని రకాల సేవలు అందించడం కూడా సాధ్యమయ్యే పని కాదు. యాత్రకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సూచనలు చేసింది. ఈ ఏడాది యాత్రను రద్దు చేయడమే మంచిదని అభిప్రాయపడింది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని యాత్రను రద్దు చేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చింతిస్తున్నాం' అని అమర్ నాథ్ బోర్డు ప్రకటించింది. మరోవైపు, ఈ ప్రకటనతో భక్తులు నిరాశలో మునిగిపోయారు.


More Telugu News