కరోనా వస్తుంది, పోతుంది అంటూ తేలిగ్గా తీసుకోవడం ప్రమాదకరం: పవన్ కల్యాణ్

  • రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందన్న పవన్
  • రోజుకు 4 వేలకు పైగా కేసులు వస్తున్నాయని ఆందోళన
  • ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని స్పష్టీకరణ
ఓవైపు కరోనా మహమ్మారిపై ప్రజలను చైతన్యపరుస్తూ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తుంటే, కరోనా సాధారణ జ్వరం వంటిదే... వస్తుంది, పోతుంది అంటూ నిర్లిప్త ధోరణితో వ్యాఖ్యలు చేయడం ఎంతో ప్రమాదకరమని జనసేనాని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఏపీలో కరోనా విజృంభిస్తోందని, నిత్యం 4 వేల నుంచి 5 వేల వరకు కొత్త కేసులు వస్తున్నాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సిన సమయం ఇదేనని అన్నారు. కరోనా వైరస్ ప్రపంచానికి వచ్చిన ఉపద్రవం అని, ప్రభుత్వం మరింత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

కరోనా పరీక్షలు పెద్ద సంఖ్యలో చేస్తున్నామని చెబుతున్నారని, కానీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు సరైన సేవలు అందుతున్నాయా? అని పవన్ ప్రశ్నించారు. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్లు, పడకలు, నాసిరకం ఆహారం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News