భారత్ లో కరోనా వ్యాక్సిన్ ధర రూ.1000 వరకు ఉండొచ్చు... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎస్ఐఐ

  • క్లినికల్ ట్రయల్స్ దశలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్
  • వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఎస్ఐఐ
  • ఆలస్యమైనా సురక్షితమైన వ్యాక్సిన్ తెస్తామని సీఈవో వెల్లడి
కరోనా మహమ్మారిని తుదముట్టించే వ్యాక్సిన్ రూపకల్పనలో బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ప్రముఖ బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా పరిశోధనలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్స్ ఫర్డ్ రూపొందిస్తున్న ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో దూసుకుపోతోంది. వలంటీర్లపై దీన్ని ప్రయోగించగా, ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ లేకపోగా, శరీరంలో యాంటీబాడీలు, టి-కణాలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. కాగా, ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ కోసం ఎంపికైన ఉత్పిత్తి కేంద్రాల్లో భారత్ లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కూడా ఉంది.

తాజాగా కోవిషీల్డ్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ లో విజయవంతం కావడం పట్ల ఎస్ఐఐ సీఈవో అడార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ అన్నిదశలను దాటిన పక్షంలో డిసెంబరు నాటికి 300 మిలియన్ల డోసులను సిద్ధం చేస్తామని చెప్పారు. భారత్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర రూ.1000 వరకు ఉండొచ్చని వెల్లడించారు. భారత్ లో కూడా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరనున్నామని, అనుమతి లభిస్తే త్వరలోనే ట్రయల్స్ ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను హడావుడిగా తీసుకురావాలని భావించడంలేదని, ఆలస్యమైనా సరే పూర్తి సురక్షితం అని నిర్ధారణ అయితేనే తీసుకువస్తామని పూనావాలా స్పష్టం చేశారు.


More Telugu News