కరోనా వైరస్ సమూహ వ్యాప్తికి ఆధారాలు లేవు.. ఉన్నదల్లా స్థానిక వ్యాప్తే: ఎయిమ్స్

  • నగరాల్లో స్థానిక వ్యాప్తి కనిపిస్తోంది
  • తొలి దశలో 18-55 ఏళ్ల మధ్య వయసున్న వారిపై వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలు
  • దక్షిణాసియా దేశాల కంటే భారత్‌లో మరణాల రేటు తక్కువ
దేశంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి మొదలైందంటూ వస్తున్న వార్తలపై ఎయిమ్స్ స్పందించింది. అలా అని చెప్పేందుకు పక్కా ఆధారాలు లేవని, అయితే,  కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థానిక వ్యాప్తి ఉందని పేర్కొంది. ముఖ్యంగా నగరాల్లో స్థానిక వ్యాప్తి కనిపిస్తోందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. ఢిల్లీలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వైరస్ తీవ్ర దశకు చేరుకోవాల్సి ఉందని అన్నారు.

ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న 18-55 ఏళ్ల వయసున్న వారిపై తొలిదశ వ్యాక్సిన్ ప్రయోగాలు చేపట్టినట్టు పేర్కొన్న గులేరియా.. 12-65 ఏళ్ల వయసున్న 750 మందిపై రెండో దశ ప్రయోగాలు చేపడతామని వివరించారు. మొత్తం 1,125 నమూనాలు సేకరించామని, వాటిలో 375 నమూనాలపై తొలిదశ అధ్యయనం చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే, ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాల కంటే మన దేశంలో వైరస్ మరణాలు తక్కువగా ఉన్నాయని, దేశంలో ఆదివారం మరణాల రేటు 2.5 శాతం కంటే తక్కువకు చేరుకుందని రణ్‌దీప్ గులేరియా వివరించారు.


More Telugu News