ప్రభుత్వాన్ని కూల్చేందుకు 6 నెలల నుంచి కుట్రలు చేస్తున్నాడు: అశోక్ గెహ్లాట్

  • బీజేపీతో కలిసి కుట్రలకు పాల్పడుతున్నాడు
  • నేను చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు
  • సచిన్ పైలట్ ఒక అయోగ్యుడు
రాజస్థాన్ కాంగ్రెస్ లో ముసలం పుట్టిన సంగతి తెలిసిందే. నిన్నటివరకు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్ సొంత పార్టీకే ఇబ్బందులు తీసుకొచ్చారు. తన మద్దతుదారులతో కలసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ సచిన్ పైలట్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

పైలట్ ఒక నిష్ప్రయోజకుడని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు గత 6 నెలలుగా బీజేపీతో కలిసి ఆయన కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పీసీసీ ప్రెసిడెంట్ గా సచిన్ పైలట్ ను తప్పించాలని గత ఏడేళ్లుగా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఆయన ఒక అయోగ్యుడని తెలిసి కూడా సర్దుకున్నామని తెలిపారు. నాయకుల మధ్య కొట్లాటలు పెట్టడం తప్ప పార్టీకి ఆయన చేసిందేమీ లేదని చెప్పారు.

ఇంగ్లీష్, హిందీలో బాగా మాట్లాడటం వల్ల ఆయన మీడియా దృష్టిని బాగా ఆకర్షించగలిగాడని గెహ్లాట్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని తాను చెబుతున్నా ఎవరూ నమ్మలేదని చెప్పారు. అమాయకంగా కనిపించే సచిన్ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదని అన్నారు. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సచిన్ నిర్బంధంలో ఉన్నారని... తనకు ఫోన్ చేసి వారి బాధలను చెప్పుకుంటున్నారని చెప్పారు. తమతో కలవాలని వారు అనుకుంటున్నారని తెలిపారు. వారి మొబైల్స్ కూడా లాక్కుంటున్నారని చెప్పారు.


More Telugu News