రాష్ట్ర ప్రభుత్వమే నాకు సమస్య.... వాళ్లు కల్పించే భద్రత నేనెలా తీసుకోవాలి?: రఘురామకృష్ణరాజు

  • ఏపీ పోలీసులతో రక్షణ వద్దంటున్న రఘురామకృష్ణరాజు
  • తనపై క్యాబినెట్ మంత్రే ఫిర్యాదు చేశాడని వెల్లడి
  • ప్రభుత్వమే వ్యతిరేకంగా ఉన్నట్టు భావించాల్సి వస్తోందన్న ఎంపీ
ఏపీ పోలీసులతో తనకు రక్షణ వుండదనీ, కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుస్తున్నానని, రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ దొరికిందని వెల్లడించారు. రక్షణ కల్పించాలంటూ రాష్ట్రపతిని ఓ ఎంపీగా కోరతానని వివరించారు.

"మా ప్రభుత్వంలోనే నాకు రక్షణ లేదంటూ కేంద్ర భద్రత కోరాల్సి రావడం దురదృష్టకరం అని భావిస్తున్నాను. మా ప్రభుత్వ క్యాబినెట్ లో ఉన్న మంత్రే నాపై ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఇంతకు మించి ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మీదో, ఇంకెవరి మీదో వేరే ఉద్దేశం లేదు. కేంద్ర బలగాలతో భద్రత వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. రెండు వారాల్లో నాకు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేస్తారన్న నమ్మకం కలుగుతోంది.

నేను ఏపీ ప్రభుత్వ రక్షణ తీసుకోకపోవడానికి బలమైన కారణం ఉంది. అక్కడ నాపై ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసుంటే పట్టించుకునేవాడ్ని కాదు, కానీ నాపై ఓ క్యాబినెట్ మంత్రే ఫిర్యాదు చేసినప్పుడు ప్రభుత్వమే నాకు వ్యతిరేకంగా ఉన్నట్టు అర్థమైంది. అయినప్పటికీ నేను వాళ్లను నమ్మితే కనుక, గొర్రె కసాయివాడ్ని నమ్మినట్టు ఉంటుంది, అందుకే కేంద్ర భద్రత కోరాల్సి వస్తోంది. ఏదేమైనా కేంద్ర బలగాల భద్రత ఉంటే ఆ ధైర్యం వేరు!" అంటూ రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు.


More Telugu News