ఇరాన్ లో కట్టలు తెంచుకున్న కరోనా... రెండున్నర కోట్ల మందికి వైరస్!
- అంచనాలు వెల్లడించిన దేశాధ్యక్షుడు
- రాబోయే నెలల్లో 3.5 కోట్ల మందికి వైరస్ సోకుతుందని వెల్లడి
- ఇరాన్ జనాభా 8.18 కోట్లు
ఆసియా దేశం ఇరాన్ లో కరోనా భీకరరూపు దాల్చింది. ఇప్పటివరకు తమ దేశంలో రెండున్నర కోట్ల మందికి వైరస్ సోకి ఉంటుందని సాక్షాత్తు ఇరాన్ అధ్యక్షుడే చెప్పడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. మున్ముందు కొన్నినెలల వ్యవధిలోనే 3.5 కోట్ల మంది వరకు వైరస్ సోకే ముప్పు ఉందని దేశాధ్యక్షుడు హసన్ రౌహానీ తెలిపారు. కరోనా భూతం తీవ్రతను గుర్తించి ప్రజలు జాగ్రత్తగా మసలుకోవాలని, ఊహించని రీతిలో కేసులు వస్తున్నాయని అన్నారు. ఇరాన్ లో ఇప్పటివరకు 2.7 లక్షల కేసులు నమోదయ్యాయి. 13 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2018 గణాంకాల ప్రకారం ఇరాన్ జనాభా 8.18 కోట్లు. అధ్యక్షుడు రౌహానీ అంచనాల ప్రకారం దేశంలో సగం మంది కరోనా బారినపడతారని భావించాలి.