ఎన్టీఆర్ మాట్లాడుతుంటే మైక్ ఇవ్వని వ్యక్తి యనమల రామకృష్ణుడు: కన్నబాబు విమర్శలు

  • బిల్లులుపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం
  • వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై యనమల వ్యాఖ్యలు
  • గవర్నర్ కే సలహా ఇస్తారా అంటూ కన్నబాబు ఆగ్రహం
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ముందుకుపోతుండడం పట్ల టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, గవర్నర్ దీనిపై ప్రజాభిప్రాయం, న్యాయ సలహా తీసుకోవాలంటూ యనమల వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ అవసరమని నిపుణులు చెప్పారని, నిపుణుల కమిటీ చెప్పింది టీడీపీ నేతల తలకు ఎక్కడంలేదని విమర్శించారు.

"మీకు తెలిసిందల్లా ఒక్కటే... మీ ప్రయోజనాలు. మీరే నిపుణులు అనుకోవడం సరికాదు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంతపాడే యనమల కొత్త కొత్త అంశాలు తెరపైకి తెస్తుంటారు. యనమల ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండోసారి మండలిలో బిల్లులు పెట్టి నెలరోజులైనందున వాటిని అసెంబ్లీ అధికారులు నిబంధనల ప్రకారం గవర్నర్ కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 (2) ప్రకారం మండలిలో రెండోసారి బిల్లులు ప్రవేశపెట్టిన నెలరోజుల తర్వాత అవి ఆటోమేటిగ్గా ఆమోదం పొందుతాయన్నది యనమలకు తెలియదా?

ఏనాడూ రాజ్యాంగాన్ని పాటించని వ్యక్తి ఈ యనమల. నాడు ఎన్టీఆర్ కు అసెంబ్లీలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వని వ్యక్తి, ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబును కాపాడేందుకు తపన పడే వ్యక్తి ఇవాళ రాజ్యాంగ నిపుణుడైన గవర్నర్ కు సలహా ఇవ్వడం ఏంటి? అమరావతిపై మీ ప్రేమ ఏంటో ప్రజలందరికీ అర్థమైంది. మీ నేతల బినామీ భూములను, మీ నాయకుల ఆస్తులను, మీ సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకే కదా మీ ప్రేమ!

 ఈ ఐదేళ్లలో మీరు అమరావతికి చేసింది ఏమిటి? తాత్కాలిక భవనాలు తప్ప ఏంచేశారు? భూములు బలవంతంగా లాక్కున్నారు. కనీసం ఆ భూములిచ్చిన వాళ్లకు తిరిగి ప్లాట్లు కూడా ఇవ్వలేకపోయారు. ఇవాళ బయట జరుగుతున్న ప్రచారం దారుణం. చంద్రబాబు వంటి రూపశిల్పికి యనమల వంటి నేతలు మద్దతుగా ఉంటూ అమరావతిని సుందరనగరంగా తీర్చిదిద్దితే ఈ ప్రభుత్వం పాడుచేసిందని, ఈ నగరానికి తాళాలు వేసిందని ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజిపై డబుల్ లైన్ కూడా వేయలేని చంద్రబాబు మహానగరం గురించి మాట్లాడుతున్నారు. 54 వేల మంది పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ నేతలకు ఎందుకు కడుపుమంట? ఏం, అమరావతిలో బడుగు, బలహీన వర్గాల పేదలు ఉండడానికి లేదా?" అంటూ కన్నబాబు ధ్వజమెత్తారు.


More Telugu News