ఓ పచ్చని కుటుంబంపై కరోనా రక్కసి పంజా... ఒంటరిగా మిగిలిన నిండు గర్భిణి

  • ప్రజాజీవితంపై కరోనా ప్రభావం
  • ఒకే కుటుంబంలో ముగ్గురి బలి
  • వరంగల్ లో భర్త, అత్తమామలను కోల్పోయిన అభాగ్యురాలు
కరోనా మహమ్మారి మానవ జీవితాలను అతలాకుతలం చేస్తోంది. సంతోషం రాజ్యమేలిన కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. వరంగల్ లో ఓ నిండు గర్భిణి అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిందంటే అది కరోనా రాసిన విధిరాత వల్లే.

వివరాల్లోకి వెళితే... వరంగల్ కు చెందిన ఓ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరూ ఒకే డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుంటారు. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఇటీవల ఆమె భర్తకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దాంతో అతడ్ని నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

ఇంతలో అతడి తండ్రికి కూడా కరోనా సోకింది. పెద్ద వయసు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన మృతిని తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు వదిలింది. అటు భర్త ఆసుపత్రిలో ఉండగా, అత్తమామల మృతితో ఆ గర్భిణీ స్త్రీ తల్లడిల్లిపోయింది. వారి కాపురంపై విధి పగబట్టిందా అన్నట్టుగా, హైదరాబాదులో చికిత్స పొందుతున్న ఆమె భర్త కూడా కరోనాతో మృత్యువాత పడ్డాడు. కొన్నిరోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన ఆ గర్భవతి శోకసంద్రంలో మునిగిపోయింది.


More Telugu News