తిరుమలలో ఆలయ జీయర్ సహా 170 మందికి కరోనా... కీలక నిర్ణయం తీసుకోనున్న టీటీడీ!

  • ఏడుకొండలపై వైరస్ స్వైర విహారం
  • ప్రసాదాల పోటులో 20 మందికి వ్యాధి
  • దర్శనాలను ఆపే విషయంలో అతి త్వరలో నిర్ణయం
కరోనా మహమ్మారి ఏడుకొండలపై స్వైర విహారం చేస్తోంది. రోజురోజుకూ వైరస్ శరవేగంగా విస్తరిస్తుండగా, ఇప్పటివరకూ 170 మంది వైరస్ బారిన పడ్డారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో ప్రధానాలయ జీయర్ కూడా ఉన్నారని, ఆయన సహా 18 మంది అర్చకులు, 100 మంది సెక్యూరిటీ సిబ్బంది, కల్యాణకట్టలోని ఇద్దరు, 20 మంది ప్రసాదాల తయారీ కేంద్రమైన పోటు ఉద్యోగులకు వైరస్ పాజిటివ్ వచ్చిందని అన్నారు.

ఇటీవల జరిగిన సమావేశంలో 60 ఏళ్లు నిండిన అర్చకులకు విధుల నుంచి మినహాయింపులు ఇచ్చామని, అర్చకుల సంక్షేమం, వారి భద్రతపై దృష్టిని కేంద్రీకరించామని తెలియజేశారు. అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామివారికి అన్ని రకాల కైంకర్యాలు, సేవలు నిరాటంకంగా సాగుతాయని, వైరస్ మరింతగా విస్తరిస్తే, దర్శనాలను మరోమారు నిలిపివేసే ఆలోచనలో ఉన్నామని ఓ అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయం అతి త్వరలో తీసుకుంటామని అన్నారు. కాగా, ఇటీవల మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి, దర్శనాల సంఖ్యను తగ్గిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.


More Telugu News