గుప్త నిధుల్ని ప్రజాభవనాల కింద ఎవరూ దాచుకోరు.. రేవంత్ క్షమాపణలు చెప్పాలి!: నిజాం మనవడు నవాబ్‌ డిమాండ్

  • జీ బ్లాక్‌ కింద బంకర్లలో నిధులు దాచిపెట్టారని రేవంత్ వ్యాఖ్యలు
  • ఆ ఆరోపణలు సరికాదన్న నవాబ్ 
  • గుప్త నిధుల్ని నివాస భవనం కిందే దాచుకుంటారని వ్యాఖ్య 
  • సోనియాకు ఫిర్యాదు చేస్తానన్న నవాబ్
తెలంగాణ సచివాలయం కూల్చివేత వెనుక 'ఆపరేషన్‌ ఖజానా' ఉందంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి  ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. గుప్త నిధుల కోసం తవ్వేవారు మాత్రమే అర్ధరాత్రి కూల్చివేత పనులు చేస్తారని, నిజాం కాలంలో జీ బ్లాక్‌ కింద బంకర్లలో నిధులు దాచిపెట్టారని చరిత్ర చెబుతోందని రేవంత్‌ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేశారు. వీటిపై 7వ నిజాం మనవడు నవాబ్‌ నజఫ్‌ అలీఖాన్  స్పందించారు.

సీఎం కేసీఆర్‌తో రేవంత్‌ రెడ్డికి విభేదాలుంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని, అంతేగానీ, నిజాం రాజుల పేర్లను ఇలా లాగడం సరికాదని నవాబ్ వ్యాఖ్యానించా‌రు. సచివాలయం కింద నేలమాళిగలో గుప్త నిధులు దాచారని, వాటిని కొట్టేయడానికే కేసీఆర్ రాత్రికి రాత్రే కూల్చివేతలు ప్రారంభించినట్లు రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని, లేదంటే తాము కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీతో పాటు రాహుల్‌ గాంధీకి ఫిర్యాదు చేస్తామని  నవాబ్‌ నజఫ్‌ అలీఖాన్ అన్నారు. గుప్త నిధుల్ని నివాస భవనం కింద లేదంటే గోడలోనో దాచుకుంటారు గానీ, ప్రజలు వచ్చే ప్రజాభవనాల కింద దాయరని ఆయన వ్యాఖ్యానించారు.


More Telugu News