హర్యానాలో సచిన్ పైలెట్ వర్గం ఎమ్మెల్యేలు.... రాజస్థాన్ పోలీసులను అడ్డుకున్న హర్యానా పోలీసులు

  • రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం
  • తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలెట్
  • తన వర్గం ఎమ్మెల్యేలతో హర్యానాలో మకాం
రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తన పట్టు వీడడంలేదు. ప్రస్తుతం సచిన్ వర్గం ఎమ్మెల్యేలు 18 మంది హర్యానాలోని మనేసర్ లో ఉన్న ఓ ఖరీదైన రిసార్టులో మకాం వేశారు. అయితే రాజస్థాన్ పోలీసులు ఈ రిసార్టులో ప్రవేశించే ప్రయత్నం చేయగా, హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

రాజస్థాన్ పోలీసులు ఇక్కడికి రావడానికి బలమైన కారణమే ఉంది. సచిన్ శిబిరంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో ప్యాకేజి మాట్లాడుకున్నట్టు ఓ ఆడియో టేప్ కలకలం రేపింది. శర్మతో పాటు ఈ ప్యాకేజీ బేరసారాల వ్యవహారంలో వున్న మరో ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఇక ఈ ప్యాకేజీ వ్యవహారంపై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేయడంతో, స్పెషల్ పోలీసుల బృందం ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ కోసం హర్యానాలోని మనేసర్ రిసార్టుకు వచ్చింది. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న హర్యానా పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. దాంతో అక్కడ కాసేపు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరికి రాజస్థాన్ పోలీసులను రిసార్టులోకి అనుమతించారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో, సచిన్ పైలెట్ వర్గీయులు అక్కడ మకాం వేశారని రాజస్థాన్ లోని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది.


More Telugu News